భూమిపై తొలిసారిగా సూపర్ క్రిటికల్ సీవో2 గుర్తించిన చైనా శాస్త్రవేత్తలు
Posted On May 12, 2020
భూమి మీద తొలిసారిగా సహజసిద్ధమైన ‘సూపర్ క్రిటికల్ కార్బన్ డై ఆక్సైడ్’(సీవో2)ను చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని వేడి నీటి బిలాల నుంచి వస్తున్న బుడగలను పరిశీలించినప్పుడు ఈ విషయం వెలుగు చూసింది. సముద్ర జలాల్లో 1400 మీటర్ల లోతులో ‘రామన్ డిటెక్షన్ ఇన్‌స్ట్రుమెంట్’తో పరిశోధించి ఈ ఆవిష్కారం చేశారు. సూపర్ క్రిటికల్ కార్బన్ డైఆక్సైడ్‌ను డ్రై క్లీనింగ్, పెట్రోలియం సాల్వెంట్లలో వాడుతుంటారు. అయితే సహజసిద్ధ రూపంలో ఇది ఇప్పటివరకు వెలుగు చూడలేదు. చుట్టుపక్కల ఉన్న సముద్ర జలాలతో పోలిస్తే సూపర్ క్రిటికల్ కార్బన్ డైఆక్సైడ్ ద్రవాల్లో భారీ స్థాయిలో నైట్రోజన్ కనిపించింది. వీటిలో గుర్తుతెలియని కొన్ని సేంద్రియ పదార్థాలనూ శాస్త్రవేత్తలు గుర్తించారు. జీవం ఆవిర్భావానికి అవసరమైన అమినో ఆమ్లాలు, సేంద్రియ పదార్థాల పరిరక్షణలో సూపర్ క్రిటికల్ కార్బన్ ఆక్సైడ్ కీలక పాత్ర పోషించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.