నాటో సదస్సులో విభేదాలు
Posted On December 04, 2019
*లండన్ లో ప్రారంభమైన నాటో కూటమి సదస్సులో సభ్యదేశాల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి పెరిగాయి.
* రెండో ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడిన నాటో కూటమి 70వ ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో ఈ విభేదాలు వచ్చాయి.
* నాటో కూటమి సైనిక సత్తాను ప్రపంచ దేశాలకు చాటే లక్ష్యంతో ఈ సదస్సును ఏర్పాటుచేశారు.
* వచ్చే ఏడాదిలో నిర్వహించనున్న సైనిక విన్యాసాలలో నాటో నౌకాదళ యుద్ధ నౌకలను దక్షిణ చైనా సముద్రంవైపు మళ్లించటంతో పాటు ఐరోపాలో రష్యాతో యుద్ధానికి సిద్ధమయ్యేందుకు వీలుగా ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు.
* ఈ విన్యాసాల కోసం అమెరికా దాదాపు 20 వేల మంది సైనికులను అట్లాంటిక్ మహాసముద్ర మార్గంలో ఐరోపాకు తరలించాలని భావిస్తోంది.
*వీరికి తోడుగా 70 యుద్ధ నౌకలు, 150 యుద్ధ విమానాలతో పాటు 10 వేలకుపైగా సాయుధ శకటాలను ఐరోపాకు తరలించనున్నారు.
*నాటో ప్రధాన కార్యదర్శి జనరల్ జెన్స్ స్టోల్టెన్ బర్గ్ --నాటో కూటమి సభ్యదేశాలు 2016 నుండి ఉమ్మడిగా సైనిక వ్యయాన్ని పెంచుతున్నాయి.ఈ సైనిక వ్యయం 2024 నాటికి 40 వేల కోట్ల డాలర్ల స్థాయికి చేరనుంది.
* గత శతాబ్దంలో రెండు ప్రపంచ యుద్ధాలను చూసిన నాటో కూటమి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ ఎదుర్కొంటున్న అభిశంసన సంక్షోభంతోను, సిరియాపై టర్కీ దురాక్రమణ, బ్రెగ్జిట్ క్రీనీడలో జరుగుతున్న బ్రిటన్ ఎన్నికలు, ఐరోపా విధానాలపై జర్మనీ, ఫ్రాన్స్‌ల మధ్య తలెత్తుతున్న ఉద్రిక్తతలతో ఈ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి.
*గత ఏడాది కెనడాలోని క్యూబెక్‌లో జరిగిన జి7 దేశాల సదస్సు ట్రంప్ నిరాకరణతో విఫలం అయింది. గత ఏడాది కాలంగా నాటో కూటమిలో సభ్యదేశాల మధ్య వివిధ అంశాలపై విభేదాలు మరింత పెరిగాయి.
*ప్రచ్ఛన్న యుద్ధం తొలి దశల్లో 1949లో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)ను సభ్య దేశాల ఉమ్మడి రక్షణకు ఒక రాజకీయ, సైనిక కూటమిగా నెలకొల్పారు.
*ఇటీవలి కాలంలో నాటోలో అంతర్గత వాతావరణం సామరస్యంగా లేదు. సంస్థను గురించి, ఇతర సభ్య దేశాల గురించి అమెరికా, ఫ్రాన్స్, టర్కీలు బాహాటంగానే విమర్శలు చేస్తున్నాయి.
*రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్‌ను నిలువరించడం ప్రధాన లక్ష్యంగా పది ఐరోపా దేశాలతో పాటు అమెరికా, కెనడా సభ్య దేశాలుగా నాటో ఏర్పాటైంది.
నాటి యుద్ధంలో ఒక విజేతగా ఆవిర్భవించిన తర్వాత సోవియట్ సైనిక బలగాలు పెద్ద సంఖ్యలో తూర్పు యూరప్‌లోనే కొనసాగాయి. తూర్పు జర్మనీ సహా పలు దేశాలపై రష్యా బలమైన ప్రభావం చూపింది.
యుద్ధం తర్వాత జర్మనీ రాజధాని బెర్లిన్‌ను విజేతలు ఆక్రమించారు. 1948 మధ్యలో సోవియట్ అధినేత జోసెఫ్ స్టాలిన్ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ల నియంత్రణలో ఉన్నప్పటికీ పూర్తిగా తూర్పు జర్మనీ పరిధిలోనే ఉన్న పశ్చిమ బెర్లిన్‌కి వ్యతిరేకంగా దిగ్బంధం మొదలుపెట్టారు.
నగరంలోకి వాయుమార్గంలో సైనిక బలగాలను విజయవంతంగా పంపించడం వల్ల ముఖాముఖి ఘర్షణ జరగలేదు. కానీ ఆ సంక్షోభం వల్ల సోవియట్ శక్తికి వ్యతిరేకంగా ఒక కూటమి రూపకల్పనను వేగవంతమైంది. 1949లో అమెరికా మరో 11 దేశాలు (బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, నార్వే, బెల్జియం, డెన్మార్క్, నెదర్లాండ్స్, పోర్చుగల్, ఐస్‌ల్యాండ్, లక్సెంబర్గ్) ఒక రాజకీయ, సైనిక కూటమిగా ఏర్పడ్డాయి.
ఈ సంస్థ 1952లో గ్రీస్, టర్కీలను చేర్చుకుని విస్తరించింది. 1955లో పశ్చిమ జర్మనీ కూడా చేరింది.
*నాటో అధికారికంగా చెప్తున్న ప్రధాన కారణం.. ''ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో సుస్థిరత, శ్రేయస్సులను పెంపొందించటం ద్వారా సభ్య దేశాల స్వాతంత్ర్యం, ఉమ్మడి వారసత్వం, నాగరికతలను సంరక్షించటం''.
నాటో సభ్య దేశాల్లో ఏదో ఒక దేశం మీద సాయుధ దాడి జరిగితే.. దానిని తమందరి మీదా దాడిగా పరిగణించటం జరుగుతుందని, అందరూ పరస్పర సాయం కోసం ముందుకు వస్తారని నాటో ఒప్పందం స్పష్టంచేస్తోంది.
1999 నుంచి మాజీ తూర్పు కూటమి (ఈస్ట్రన్ బ్లాక్) దేశాలు కూడా ఇందులో చేరాయి. మొత్తం సభ్య దేశాల సంఖ్య 29కి పెరిగింది. తాజాగా 2017 జూన్‌లో మాంటెనిగ్రో కూడా నాటో భాగస్వామిగా మారింది.
*అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నాటోను తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఆయన 2016లో అధ్యక్ష అభ్యర్థిగా ఉన్నప్పుడే.. నాటోకు ''కాలం చెల్లిందని'' ఆ సంస్థ ''ముక్కలైతే బాగుంటుంద''ని ఆయన వ్యాఖ్యానించారు.
కూటమి సభ్య దేశాల మీద దాడి జరిగితే రక్షించాలన్న నిబద్ధతకు కట్టుబడి ఉండటానికి అమెరికా తిరస్కరించవచ్చునని - అసలు నాటో నుంచే వైదొలగవచ్చునని కూడా ట్రంప్ సంకేతాలిచ్చారు.
నాటో సభ్య దేశాల్లో ఏ దేశం కన్నా కానీ రక్షణ కోసం అమెరికా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతోందని కూడా ఆయన ఫిర్యాదు చేశారు.