ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు ఇనామ్
Posted On February 20, 2019
*ఈ మేరకు కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిబ్రవరి 19న సమాచారం అందింది. త్వరలో ఈ ఆర్డినెన్స్ అమలుకు సంబంధించిన ఆదేశాలను రెవెన్యూశాఖ జారీ చేయనుంది. దీని వల్ల లక్షలాది మంది రైతులు, గృహ యజమానులకు మేలు జరగనుంది. 3.23లక్షల ఎకరాల భూములు నిషేధ జాబితా నుంచి బయటపడనున్నాయి. దీనివల్ల సుమారు ఆరు లక్షల మందికి భారీ ఉపశమనం లభించనుంది.
*స్వాతంత్ర్యానికి పూర్వం రాజులు, జమీందారుల కాలంలో వారికి సేవలు చేసినందుకు వృత్తిదారుల జీవనభృతికోసం సాగుభూములను ఇనామ్‌గా ఇచ్చేవారు. కాలక్రమేణా దేవాలయాల పరిధిలోనూ ఈ విధానం వచ్చింది. ఆలయాల్లో ప్రత్యేకంగా పూజలు, ఇతర సేవలు అందించినందుకు ప్రతిఫలంగా సర్వీస్ ఇనామ్ కింద భూములు ఇచ్చారు. స్వాతంత్ర్యానంతరం రాజులు, సంస్థానాలు, జమీన్‌లు రద్దయిపోయాయి.
*1956లో ప్రభుత్వం ఇనామ్ రద్దు చట్టం తీసుకొచ్చింది. వాటి కింద సాగు చేస్తున్న భూములను, వాటిని పొందిన వారిని గుర్తించి వారి వద్ద ఉన్న రికార్డులను పరిశీలన చేసి రైత్వారీ పట్టాలు మంజూరు చేసింది. ఈ మేరకు 1957లో ఇనామ్ (ఇనామ్ రద్దు-రైత్వారీ పట్టాలుగా మార్పిడి) చట్టం నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇలా 1957 నుంచి 2013 వరకు దాదాపు లక్ష ఎకరాలకుగాను రైత్వారీ పట్టాలు మంజూరు చేశారు. గుంటూరు, జగ్గయ్యపేట, అన్నవరం, ప్రకాశం జిల్లాల్లోని 32 గ్రామాలన్నీ ఇనామ్ పరిధిలోనివే.
*కాలక్రమేణా సాగు భూముల్లో ఇళ్లు వెలిశాయి. నగరాలు పుట్టుకొచ్చాయి. ఇలా సగం గుంటూరు నగరం, జగ్గయ్యపేటలు అభివృద్ధిచెందాయి.
*అయితే 2006-2012 వరకు ఇనామ్ భూముల దుర్వినియోగం భారీగా పెరిగింది. సర్వీసు చేయని వారు, గ్రామాలతో సంబంధం లేని వ్యక్తులు రంగప్రవేశం చేసి సేవలు చేశామంటూ విలువైన భూములకు రైత్వారీ పట్టాలు పొందారు. వాస్తవాలను పరిశీలించి అనర్హులను ఏరివేయాల్సిన రెవెన్యూశాఖనే.. అప్పట్లో కోరిన వారికి, ఒత్తిళ్లు, పైరవీలతో ముందుకొచ్చినవారికి రెడ్‌కార్పెట్ పరచి రైత్వారీ పట్టాలు ఇచ్చింది.
*దీనిపై తీవ్ర దుమారం చెలరేగడం, అనేక కోర్టు కేసులు రావడంతో 2013లో ఇనామ్ చట్టసవరణ ప్రతిపాదన తీసుకొచ్చారు. వరుస సర్వీసులో ఉండేవారికే ఇనామ్ భూములపై ప్రతిఫలం పొందే హక్కు ఉండాలని, ఎవరి పేరిటా రైత్వారీ పట్టాలు కొత్తగా ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఎప్పటినుంచి అమలు చేయాలి, కొత్తగా ఎప్పటి నుంచి పట్టాలు ఇవ్వకూడదన్న అంశాలపై రెవెన్యూశాఖ తప్పటడుగులు వేసింది.