మసీదులో ప్రార్థనలకు మహిళలకు అవకాశం
Posted On January 30, 2020
*సుప్రీంకోర్టులో అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్‌బీ) అఫిడవిట్ --
1.మసీదుల్లోకి వచ్చి ముస్లిం మహిళలు ప్రార్థనలు చేయడం ఇస్లాంలో ఆమోదనీయమే అని ప్రకటించింది.
2.ముస్లిం పురుషుల మాదిరిగానే ముస్లిం మహిళలు కూడా నమాజ్ చేసేందుకు మసీదుకు రావొచ్చు తెలిపింది.
3.మత గ్రంథాలు, సిద్ధాంతాలు, ఇస్లాంను అనుసరిస్తున్న వారి మత విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత.. మసీదు లోపల నమాజ్ చేసుకునేందుకు ముస్లిం మహిళలకు ప్రవేశం ఉంది అని తెలిపింది.
4.ముస్లిం మహిళ మసీదులోకి వెళ్లి ప్రార్థనలు చేసుకోవచ్చు. ఈ హక్కును వినియోగించుకోవడం ఆమె ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది అని తెలిపింది.
5.సామూహిక ప్రార్థనలు లేదా శుక్రవారం నమాజ్‌లో పురుషుల మాదిరిగా మహిళలు విధిగా పాల్గొనాలని ఇస్లాంలో నిబంధన లేదు.
6.ఇస్లాంలో మహిళకు ప్రత్యేక స్థానం కల్పించారని, ఆమె తన అభీష్టంమేరకు మసీదులో ప్రార్థనలు చేసినా లేదా ఇంటిలో ప్రార్థనలు చేసినా ఒకేవిధమైన ప్రతిఫలం దక్కుతుందని ఏఐఎంపీఎల్‌బీ తెలిపింది.
7.మతపరమైన ఆచారాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోవడం సరైనది కాదని కూడా ఈ బోర్డు తెలిపింది.
8.మత ఆచారాలపై నిర్ణయాధికారం మతసంస్థలకు మాత్రమే ఉండదా? దీనిపై కోర్టులు జోక్యం చేసుకోవచ్చా? అనేది పరిశీలించాలని కోరింది.
*నేపథ్యం --మసీదుల్లోకి ముస్లిం మహిళలను అనుమతించేందుకు న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని కోరుతూ యాస్మిన్ జుబెర్ అహ్మద్ పీర్జాదే అనే వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మసీదుల్లోకి వచ్చి ముస్లిం మహిళలు ప్రార్థనలు చేయవచ్చని అఫిడవిట్ దాఖలుచేసింది.
* ధర్మాసనం -- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం దీన్ని పరిశీలించనుంది.
*కేరళలోని శబరిమల ఆలయంతోపాటు వివిధ మతాలు, మతపరమైన ప్రదేశాల్లో మహిళలపై వివక్షకు సంబంధించి న్యాయ, రాజ్యాంగపరమైన అంశాలపై ఈ ధర్మాసనం విచారణ చేపడుతున్నది.