ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ని వెనక్కి నెట్టిన రిలయన్స్ ఇండస్ట్రీస్
Posted On December 17, 2019
*దేశంలో అత్యధిక ఆదాయం ఆర్జించిన సంస్థగా ఆర్‌ఐఎల్ రికార్డు సృష్టించింది.
* గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను కంపెనీ రూ.5.81 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత పదేండ్లుగా అత్యధిక ఆదాయాన్ని ఆర్జించి తొలిస్థానంలో నిలిచిన ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ)ని వెనక్కినెట్టి ఈ స్థానాన్ని దక్కించుకున్నది ఆర్‌ఐఎల్.
*ఐవోసీ గతేడాది రూ.5.36 లక్షల కోట్ల ఆదాయంతో రెండో స్థానానికి పడిపోయింది. ప్రస్తుత సంవత్సరానికిగాను ఫార్చ్యూన్ ఇండియా 500 విడుదలచేసిన జాబితాలో ఈ విషయం వెల్లడైంది.
* స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన 2010 నుంచి అంతక్రితం ఏడాది వరకు ఐవోసీ తొలిస్థానంలోనే కొనసాగింది.
*రిలయన్స్ తొలి స్థానం రావడానికి రిటైల్, టెలికం, కన్జ్యూమర్ వ్యాపారాలు కారణం అని ఈ నివేదిక వెల్లడించింది.
*ఆర్‌ఐఎల్..2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.39,588 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇదే సమయంలో ఐవోసీ రూ.17,337 కోట్లు మాత్రమే.
*దేశీయ కార్పొరేట్ ప్రపంచంలో ఇంతటి స్థాయి ఆదాయాన్ని ఆర్జించిన సంస్థగాను ఆర్‌ఐఎల్ రికార్డు సృష్టించింది. ఆర్‌ఐఎల్ ఆదాయంలో 41.5 శాతం వృద్ధిని కనబరుచగా, అదే ఐవోసీ ఆదాయంలో 33.1 శాతం పెరుగుదల కనిపించింది.
*అంటే ఐవోసీ కంటే ఆర్‌ఐఎల్ ఆదాయం 8.4 శాతం అధిక వృద్ధిని నమోదు చేసుకున్నది. ఇదివరకు ప్రభుత్వరంగ సంస్థయైన ఐవోసీ పేరిట ఈ రికార్డు ఉన్నది.
*గడిచిన పదేండ్లలో ఆర్‌ఐఎల్ నికర లాభం ఐవోసీ కంటే మూడు రెట్లు అధికంగా ఉన్నది. ఈ జాబితాలో 2018లో మూడోస్థానంలో నిలిచిన మరో ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ) ఈసారి కూడా ఇదే స్థానంలో కొనసాగింది.
* ఆ తర్వాతి స్థానాల్లో బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఉండగా, టాటా మోటర్స్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) ఉన్నాయి.
*ఓఎన్‌జీసీ ఇటీవల కొనుగోలు చేసిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్), ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్‌లను కలుపుకోకుండానే ఈ జాబితాను రూపొందించింది ఫార్చ్యూన్.
*రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఒక్కస్థానం ఎగబాకి ఈసారి 7వ స్థానానికి చేరుకున్నది.
*ఆ తర్వాతి స్థానాల్లో టాటా స్టీల్, కోల్ ఇండియా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, లార్సెన్ అండ్ టుబ్రోలు నిలిచాయి. ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ రెండు స్థానాలు ఎగబాకి 12వ స్థానానికి చేరింది.
*స్తుత సంవత్సరానికిగాను ఫార్చ్యూన్ జాబితాలో వేదాంతా తన ర్యాంక్‌ను మూడు స్థానాలు కోల్పోయి 18కి జారుకున్నది.
*ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీలకు వచ్చిన మొత్తం ఆదాయంలో 22.3 శాతం చమురు, గ్యాస్ రంగాలకు చెందినవి కాగా, 15.88 శాతం బ్యాంకింగ్ రంగానికి చెందినవి.
*ఈ జాబితాలో సంఖ్యపరంగా చూస్తే బ్యాంకింగ్ రంగానికి చెందినవి 48 సంస్థలు ఉండగా, లాభాల్లో 23.44 శాతం వాటాతో చమురు, గ్యాస్ సంస్థలు ఉన్నాయి.