తెలియా రుమాల్‌కు భౌగోళిక గుర్తింపు
Posted On May 16, 2020
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం పుట్టపాకలోని తయారయ్యే తెలియా రుమాల్‌కు భౌగోళిక గుర్తింపు(జీఐ) లభించింది. దీనికి సంబంధించి 10న చెన్నైలోని జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ కార్యాలయం ఆమోదం తెలిపింది. తేలియా రుమాల్ అనే వస్త్రం ప్రాచీన కళకు సంబంధించింది. ఈ వస్త్రాన్ని సహజ రంగులు, ముడిపదార్థాలతో తయారు చేస్తారు. వేసవికాలం చల్లగా, చలికాలం వెచ్చగా ఉంటుంది. 2017లో హ్యాండ్లూమ్ క్లస్టర్ పేరు మీద జీఐ కోసం దరఖాస్తు చేశారు. తేలియా రుమాల్ తయారీ ద్వారానే పుట్టపాకలోని గజం గోవర్ధనా, గజం అంజయ్యతోపాటు ఎంతోమంది చేనేత కళాకారులు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, గుర్తింపు పత్రాలు అందుకున్నారు.
అద్భుత నైపుణ్యానికి ప్రతీక
తెలియా అంటే నూనే అని అర్ధం. తెలియా రుమాల్ అనేది అరుదైన చేనేత వస్త్రం. నూనే పూసిన దారంతో తెలియా రుమాల్‌ను తయారు చేస్తారు. ఇందులో ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజ సిద్ధంగా లభించేరంగులను మాత్రమే ఉపయోగిస్తారు. ఎరుపు, నలుపు, తెలుపురంగులు కలగలిసి ఉండే ఈ రుమాల్‌ను ధరిస్తే వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉండటం విశే షం. కొన్ని దశాబ్దాల క్రితంవరకు దీనిని విరివిగా ఉపయోగించేవారు.