మతపరమైన అంశాలపై సుప్రీం జోక్యం చేసుకోవచ్చా ?
Posted On January 17, 2020
* శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలని ఆదేశిస్తూ 2018లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
* మతపరమైన ఆచారవ్యవహారాలలో కోర్టులు ఏ మేరకు జోక్యం చేసుకోవచ్చు.. వంటి అంశాలపై మాత్రమే విచారణ జరుగుతోంది.
*శబరిమల కేసు విచారణలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం గత నవంబర్ 14న తమకు నివేదించిన అంశాలకు మాత్రమే చీఫ్ జస్టిస్ (సీజేఐ) ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని తొమ్మిదిమంది సభ్యుల ధర్మాసనం పరిమితమవుతోంది.
*శబరిమల అంశంపై 2019లో సుప్రీంకోర్టు తీర్పు---గత ఏడాది నవంబర్ 14న అప్పటి చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం 3:2 మెజారిటీతో కొన్ని అంశాలను విచారణ నిమిత్తం విస్తృత ధర్మాసనానికి నివేదించింది. అవి.. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 25, 26లో మతస్వేచ్ఛ కింద భిన్న ప్రభావం, 'రాజ్యాంగ నైతికత'అనే వ్యక్తీకరణను వివరించాల్సిన అవసరం, మతపరమైన ఆచార వ్యవహారాలలో కోర్టులు ఏ మేరకు జోక్యం చేసుకోవచ్చు, ఆర్టికల్ 25 కింద హిందువులలోని వివిధ వర్గాలకు అర్థం, మతంలోని ఒక వర్గం లేదా తెగలో 'తప్పనిసరిగా పాటించాల్సిన ఆచారాల'కు ఆర్టికల్ 26 కింద ఉన్న సంరక్షణ.ఈ అంశాలపై ఒక నిర్ణయానికి వచ్చేంత వరకు శబరిమల కేసులో రివ్యూ పిటిషన్లపై విచారణ పెండింగ్‌లో ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
*ప్రార్థన స్థలాలలోనికి మహిళలు, బాలికల ప్రవేశంపై నిషేధం విధించడం రాజ్యాంగపరంగా చెల్లుబాటవుతుందా అన్నది కేవలం శబరిమలకు మాత్రమే పరిమితం కాలేదని జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పులో వ్యాఖ్యానించింది.మసీదులు, దర్గాలలోనికి ముస్లిం మహిళల ప్రవేశంపై ఆంక్షలున్నాయి, పార్శీయేతర పురుషుడిని పెండ్లి చేసుకున్న పార్శీ మహిళను అగ్యారీ పవిత్ర అగ్ని వద్దకు రాకుండా నిషేధం విధించారు.
*మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, దావూదీ బోహ్రా ముస్లింలలో మహిళల జననాంగ విచ్ఛిత్తి, పార్శీయేతర పురుషుడిని పెండ్లి చేసుకున్న పార్శీ మహిళకు అగ్యారీలోని పవిత్ర అగ్ని వద్దకు రాకుండా నిషేధం వంటి అంశాలకు సంబంధించిన పిటిషన్లను లిస్టింగ్‌లో ఉంచాలని కోరుతామని, అయితే వాటిపై ఇప్పుడే ఎటువంటి నిర్ణయం తీసుకోబోమని ధర్మాసనం పేర్కొంది.
*ఈ విస్తృత ధర్మాసనంలో సీజేఐతోపాటు జస్టిస్‌లు ఆర్ భానుమతి, అశోక్ భూషణ్, ఎల్ నాగేశ్వరరావు, ఎం ఎం శంతనగౌడర్, ఎస్ అబ్దుల్ నజీర్, ఆర్ సుభాష్‌రెడ్డి, బీఆర్ గవాయ్, సూర్యకాంత్ ఉన్నారు.
*విచారణ జరుపాల్సిన అంశాలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఏఎం సింఘ్వీతో సహా నలుగురు సీనియర్ న్యాయవాదులు నిర్ణయిస్తారు.