గోదావరి-శ్రీశైలము (క్రిష్ణా ) నీటి మళ్లింపు
Posted On July 09, 2019
*గోదావరి నుంచి శ్రీశైలం వరకు నీటిని మళ్లించే పలు ప్రత్యామ్నాయాలపై ఇందుకోసం తెలుగు రాష్ట్రాల ఉన్నతస్థాయి ఇంజినీర్లు హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు.
* తెలంగాణ ఇంజినీర్లు రెండు, ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్లు మూడు రకాల ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేసి తయారు చేసిన గోదావరి-శ్రీశైలం, గోదావరి-నాగార్జునసాగర్ నీటి మళ్లింపు పథకాలపై చర్చించనున్నారు.
* ఈ చర్చల్లో ఒకటి లేదా రెండు ప్రతిపాదనలకు తుది రూపం ఇచ్చి మళ్లీ జరగబోయే ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం ముందుంచనున్నారు.
* తెలంగాణలో గోదావరి నుంచి శ్రీశైలంకు, ఆంధ్రప్రదేశ్ పోలవరం నుంచి నాగార్జునసాగర్ ద్వారా శ్రీశైలంకు నీటిని మళ్లించే పథకాలపై లోతుగా అధ్యయనం చేసిన ఇతర ప్రత్యామ్నాయాలపై కూడా రెండు రాష్ట్రాల ఇంజినీర్లు ప్రాథమిక అధ్యయనం చేసి నివేదికలు సిద్ధం చేసుకున్నారు.
* తెలంగాణ నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్, అంతర్‌రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజినీరు నరసింహారావు, విశ్రాంత ఇంజినీర్లు శ్యాంప్రసాద్‌రెడ్డి, వెంకటరామారావు, చంద్రమౌళి, సత్తిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, హైడ్రాలజీ విభాగం చీఫ్ ఇంజినీర్ కుమార్, కర్నూలు జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీరు నారాయణరెడ్డి, విశ్రాంత ఇంజినీర్లు రెహ్మాన్, రౌతు సత్యనారాయణ, సుబ్బారావు, ప్రభాకర్‌రెడ్డి, సలహాదారు రోశయ్య తదితరులు పాల్గొంటారు.
* తెలంగాణ ఇంజినీర్లు ప్రతిపాదనలిలా ఉన్నాయి. గోదావరి నీటిని రాంపూర్ వద్ద నుంచి మళ్లించి నల్గొండ జిల్లాలోని ఉదయసముద్రంకు తీసుకెళ్లడం, అక్కడి నుంచి ఒక కాలువను నాగార్జునసాగర్‌కు, ఇంకో కాలువను శ్రీశైలంకు మళ్లించడం. ఇందులో భారీ సొరంగం, లిఫ్టుల ద్వారా 380 కిలోమీటర్ల దూరం నీటిని మళ్లించాలి కాబట్టి సుమారు రూ.లక్ష కోట్లు ఖర్చవుతుందని అంచనా.
* పోలవరం నుంచి వైకుంఠపురం రిజర్వాయర్, పులిచింతల, టేల్‌పాండ్ ద్వారా నాగార్జునసాగర్, ఇక్కడి నుంచి శ్రీశైలంకు నీటిని మళ్లించేలా మరో పథకాన్ని ప్రతిపాదించారు. ఈ పథకం ద్వారా శ్రీశైలంకు రోజూ 2.8 టీఎంసీలు మళ్లించవచ్చన్నది అంచనా.
* పోలవరం నుంచి రెండు రాష్ట్రాల సరిహద్దు ద్వారా కృష్ణా వైపు మళ్లించి పులిచింతల వెనుకభాగంలో పోస్తే, ఇక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరంలోని టేల్‌పాండ్‌కు తీసుకెళ్లేలా ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్లు ప్రతిపాదించారు. టేల్‌పాండ్ నుంచి నాగార్జునసాగర్‌కు, ఇక్కడి నుంచి రివర్సబుల్ టర్బైన్స్ ద్వారా శ్రీశైలంకు మళ్లించడానికి అవకాశం ఉంది.
* పులిచింతల పూర్తి స్థాయి నీటిమట్టం 53.5 మీటర్లు కాబట్టి 45 మీటర్ల నుంచి నీటిని తీసుకొనేలా చేసి నదికి సమాంతరంగా 25 కి.మీ దూరం కాలువ తవ్వి 75.5 మీటర్ల పూర్తి స్థాయి మట్టంతో ఉన్న టేల్‌పాండ్‌కు తీసుకెళ్లి రివర్సబుల్ టర్బైన్స్ ద్వారా సాగర్‌కు, తర్వాత శ్రీశైలంకు మళ్లించడం. పోలవరం నుంచి ఈ ప్రవాహమార్గం 240 కి.మీ కాగా, ఈ పథకానికి రూ.60 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా.
* దుమ్ముగూడెం నుంచే రోజూ నాలుగు టీఎంసీలు మళ్లించడం మరో ప్రతిపాదన. దుమ్ముగూడెం వద్ద ఆనకట్ట ఎత్తును 62 మీటర్ల మట్టానికి పెంచితే 20 టీఎంసీల వరకు నిల్వ చేయవచ్చని, ఇక్కడి నుంచి రోజూ నాలుగు టీఎంసీలు మళ్లిస్తే నాగార్జునసాగర్ ఎడమకాలువ, కుడికాలువకు ఇవ్వడంతో పాటు, హాలియా నది కుడివైపు నుంచి శ్రీశైలంకు మళ్లించ డానికి అవకాశం ఉంటుందని ప్రతిపాదన.
* తుపాకులగూడెం నుంచి శ్రీశైలంకు ఇంకో ప్రతిపాదన. వీటన్నింటిపైనా రెండు రాష్ట్రాల ఇంజినీర్లు చర్చించనున్నారు. ఒకే పథకం ద్వారా నీటిని మళ్లించడం లేదా తెలంగాణలోని ఒకచోట నుంచి రెండు టీఎంసీలు, పోలవరం నుంచి రెండు టీఎంసీలు మళ్లించే ప్రతిపాదనలపై ప్రాథమిక అధ్యయనం చేసి నివేదికలు సిద్ధం చేసుకున్నారు.