దేశవ్యాప్తంగా ఆరు నగరాలకు 5స్టార్ రేటింగ్
Posted On May 21, 2020
వ్యర్థాల(గార్బేజ్) నిర్వహణలో సమర్ధంగా వ్యవహరించిన నగరాలకు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మే 19న ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది.
దేశంలో శుభ్రత విషయంలో పట్టణ స్థానిక సంస్థలు చూపుతున్న ప్రతిభ ఆధారంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ దేశంలోని 141 నగరాలకు సింగిల్, త్రి, ఫైవ్‌స్టార్ రేటింగ్స్ ఇచ్చింది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌పూరీ, ఆశాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రాలు మంగళవారం ఇక్కడ ఈ రేటింగ్స్‌ను విడుదల చేశారు.
దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోని స్థానిక సంస్థలు ముందంజలో నిలిచాయి. ఫైవ్‌స్టార్ రేటింగ్స్ ఆరు నగరాలకు లభించగా..అందులో అంబికాపుర్ (ఛత్తీస్‌గఢ్), రాజ్‌కోట్, సూరత్ (గుజరాత్), మైసూరు (కర్ణాటక), ఇండోర్ (మధ్యప్రదేశ్), నవీ ముంబయి(మహారాష్ట్ర) ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, విజయవాడ నగరపాలక సంస్థలకు త్రీస్టార్ రేటింగ్స్ దక్కగా..చీరాల, విశాఖపట్నం, పలమనేరు, సత్తెనపల్లి పట్టణ స్థానిక సంస్థలకు సింగిల్ స్టార్ దక్కింది. ఫైవ్‌స్టార్ రేటింగ్ రాష్ట్రానికి దక్కలేదు.
దేశంలోని ఏ నగరానికీ 7స్టార్ రేటింగ్ దక్కలేదు. మొత్తం 12 రాష్ట్రాల్లోని నగరాలకు మాత్రమే రేటింగ్స్ ఇచ్చారు. ఈ జాబితాలో తెలంగాణ లేదు. 2016 నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులను పరిశుభ్రత, ఓడీఎఫ్ ఆధారంగా ప్రకటించారు. అయితే పట్టణాలు వ్యర్థాల నుంచి విముక్తం కావడం అత్యంత ముఖ్యమని భావించి ఇప్పుడు గార్బేజ్‌ఫ్రీకి సంబంధించి కొత్త రేటింగ్‌లు ప్రకటించారు. గత ఏడాది తొలి ర్యాంకింగ్ ఇవ్వగా..ఇప్పుడు రెండోసారి 1, 3, 5 స్టార్ రేటింగ్స్ ప్రకటించారు.